కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలకు, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఫలప్రదం కావాలని, కనీస మద్దతు ధర విషయంలో రైతులు వ్యక్తం చేస్తున్న ఆందోళనకు తగిన పరిష్కారం త్వరలో లభిస్తుందని ఆశిస్తున్నాం.
దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తమ ఆందోళనలో భాగంగా రేపు నిర్వహించతలపెట్టిన బంద్ విషయంలో వారి మనోభావాలను గౌరవిస్తున్నాం. అయితే రైతు సంఘాలు ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావివ్వకుండా, మధ్యాహ్నం 1 గంటలోపు, బంద్‌ను ముగించుకుంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉంటుంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరవాలని ఆదేశిస్తున్నాం. అలాగే 1 గంట వరకూ బస్సు సర్వీసులను నడపవద్దని ఆర్టీసీని కూడా ఆదేశిస్తున్నాం. విద్యాసంస్థలను రేపు పూర్తిగా మూసివేయాల్సిందిగా కూడా ఆదేశిస్తున్నాం. బంద్ పూర్తి స్వచ్ఛందంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తిచేస్తున్నాం.
ఇక్కడే మరొక విషయాన్నికూడా ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాం. నిజానికి కేంద్రంలో వ్యవసాయ బిల్లులకు చంద్రబాబు పార్టీ బేషరతుగా, గట్టిగా ఆరోజు మద్దతు పలికిన విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ కనీస మద్దతు ధర ( ఎంఎస్పీ)కు పూర్తి భరోసా ఇస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ హామీ నేపథ్యంలో మాత్రమే, రైతుల ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదన్న కేంద్ర ప్రభుత్వ హామీ నేపథ్యంలోనే వ్యవసాయ బిల్లులకు షరతులతో కూడిన మద్దతు పలికిన విషయంకూడా అందరికీ తెలుసు.
కాని ఈరోజు, చంద్రబాబు మరో యూటర్న్ తీసుకుని జిల్లాకేంద్రాల్లో కలెక్టర్లకు రేపు విజ్ఞాపనలు ఇవ్వాల్సిందిగా నిర్ణయించారని మీడియా ద్వారా వింటున్నాం. పార్లమెంటులో బిల్లులకు బేషరతుగా మద్దతు పలికి, ఇప్పుడు జిల్లాకలెక్టర్లకు చంద్రబాబు పార్టీ విజ్ఞాపనలు ఇవ్వడం ఎంతటి దిగజారుడు రాజకీయమో అందరికీ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాల అంశంలో కలెక్టర్లకు ఏం పాత్ర ఉంటుంది? వ్యవసాయ బిల్లులు సెప్టెంబరులో ఆమోదం పొందితే నవంబరు వరకూ కనీసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం ముక్కకూడా రాయలేదు. ఇవాళ కూడా ఢిల్లీ వెళ్లి గతంలో మాదిరిగా ఒక ధర్నా చేస్తాననికూడా ప్రకటించడంలేదు. మరి ఎందుకు ఈడ్రామాలు.
కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య జరుగుతున్న చర్చలు త్వరలోనే సఫలమై మంచి పరిష్కారాలు లభించాలని కోరుకుంటున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మే పార్టీగా, రైతుపక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రకటన చేస్తున్నాం.